బీజేపీ ప్రజాస్వామ్య హత్య చేస్తోంది
రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మణుగూరులో కాంగ్రెస్ నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ రాస్తారోకో
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కక్ష పెట్టుకొని అక్రమ అరెస్టు చేసిందని మణుగూరు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ బుధవారం అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం దేశ ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని, ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ రాస్తారోకోతో ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

