- పెండింగ్ వేతనాల విడుదలతో పాటు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర సంయుక్త చర్యా సమితి (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు మంగపేట మండలంలోని ఉపాధి హామీ పథకం ఉద్యోగులు శుక్రవారం పెన్‌డౌన్, షెడ్‌డౌన్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం మండల కార్యక్రమ అధికారి మహమ్మద్ అంకూస్ మాట్లాడుతూ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయడంతో పాటు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా కల్పించే విధంగా కెరీర్ అభివృద్ధి విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు నాయకపు శిరీష, బొల్లా సతీష్, ఏడుల్ల రాంబాబు, కంప్యూటర్ నిర్వాహకుడు అడ్డూరి శ్రీకాంత్, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

