తెలంగాణ రైతుపై ఆంధ్ర కాంట్రాక్టర్ జులుం
రైతును వేధిస్తూ అక్రమ కేసులు బనాయించిన జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్
రైతు పేరు మీదే అక్రమంగా కరెంట్ మీటర్ ఏర్పాటు
లీజు మాటున రైతు భూమిలో ఇష్టారాజ్యం
పూర్తి స్థాయి నాలా కన్వర్షన్ లేకుండానే రెడీమిక్స్ ప్లాంట్
హైవే పనుల పేరుతో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ శాఖలు
అనుమతులు కొంత, అవినీతి కొండంతగా సాగుతున్న దందా
అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి పూర్తి మద్దతు
కాకతీయ, మయూరి సెంటర్ : తెలంగాణకు చెందిన ఓ సామాన్య రైతు భూమిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి చట్టబద్ధమైన ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు లేకుండానే రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నడుపుతూ, ఎన్ హెచ్ 365-ఏ రోడ్డు పనుల పేరుతో బరితెగిస్తున్నాడని స్థానిక బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ దందా వెనుక అసలు కథ ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 7 ఎకరాల విస్తీర్ణం గల సారవంతమైన వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్నాడు. ఎన్ హెచ్ 365-ఏ కింద ఖమ్మం నుంచి కురవి వరకు సాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కొరకు అగ్రిమెంట్ చేసుకుని ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. నియమాల ప్రకారం ఈ వ్యవసాయ భూమిలో కేవలం రోడ్డు పనులకు ఉపయోగించే యంత్ర సామాగ్రిని, రోడ్డు నిర్మాణంలో పనిచేసే కార్మికుల కోసం నివాస షెడ్లను, కంపెనీకి చెందిన వాహనాలు, ఇతర నిర్మాణ సామగ్రిని మాత్రమే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసిన సదరు కాంట్రాక్టర్, ఆ వ్యవసాయ భూమిని అక్రమంగా ఒక భారీ కమర్షియల్ రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్‌గా మార్చేశాడు. అంతేకాకుండా భూమిని లీజుకిచ్చిన అసలు రైతుపైనే ఎదురు తిరుగుతూ నానాటికీ వేధింపులకు గురిచేస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతుపైనే అక్రమ కేసు బనాయించిన నీచమైన వైనం
ఆర్ఎంసి ప్లాంటు నిర్వహణ కోసం వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్న గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం, ఏకంగా భూమిని ఇచ్చిన స్థానిక రైతుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమ కేసు నమోదు చేయించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. రోడ్డు నిర్మాణ పనులు చేసే కార్మికుల కోసం ఈ వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున నివాస షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ నివాస స్థలాలలో ఉండే కార్మికుల కోసం వంట చేసి పెట్టే పని నిమిత్తం, భూమిని లీజుకిచ్చిన అదే స్థానిక రైతును జి.ఎస్.ఆర్. కంపెనీ వంట మాస్టర్‌గా పనికి కుదుర్చుకుంది. అయితే, వంట గది నుండి కూరగాయలు, నిత్యవసర సరుకులు ఎత్తుకెళ్లాడంటూ ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ, ఏకంగా తన భూమిని లీజుకిచ్చిన ఆ రైతుపైనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదు చేయించారు. తనను నమ్మి భూమి ఇస్తే ఇలా అక్రమ కేసులు బనాయించి వేధిస్తారా అని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ అక్రమ కేసుపై మరియు కంపెనీ అరాచకాలపై త్వరలోనే రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు స్పష్టం చేశారు.

ప్లాంటుకు అక్రమంగా కరెంట్ సప్లై.. అధికారుల అండదండలు!
రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 62అ/2, 64అ/1/2, 64అ/1, 76ఈ/3, 76ఈ/2 లలో విస్తరించి ఉన్న 7 ఎకరాల విశాలమైన వ్యవసాయ భూమిని సంవత్సరానికి లక్షా తొంబై ఆరు వేల రూపాయల చొప్పున అగ్రిమెంట్ చేసుకుని జి.ఎస్.ఆర్. ఆంధ్ర కన్స్ట్రక్షన్ కంపెనీ లీజుకు తీసుకుంది. రికార్డుల ప్రకారం చూస్తే మొత్తం పంట పండే ఈ వ్యవసాయ భూమిలో కేవలం 3 కుంటలకు మాత్రమే నాలా కన్వర్షన్ జరిగినట్లు తెలంగాణ భూభారతి పోర్టల్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా భూమి అంతా పూర్తిగా వ్యవసాయ భూమి కిందనే నమోదై ఉంది. ఎలాంటి అధికారిక ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఈ వ్యవసాయ భూమిని పూర్తిగా కమర్షియల్ ప్లాంటుగా మార్చి ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఇలా వ్యవసాయేతర కార్యకలాపాలు సాగిస్తుండటం వల్ల చుట్టుపక్కల ఉన్న పచ్చని పంట పొలాలకు, భూగర్భ జలాలకు తీవ్రమైన హాని జరుగుతోందని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నుండి కరెంట్ మీటర్ కొరకు అన్ని అనుమతులు తీసుకున్నామని కంపెనీ చెబుతున్నప్పటికీ, ఆ మీటర్ మాత్రము కంపెనీ పేరు మీద కాకుండా ఏకంగా భూమిని లీజుకిచ్చిన ఆ స్థానిక రైతు పేరు మీదనే అక్రమంగా ఎలా పొందారనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమాయక రైతును మోసం చేసేలా కరెంట్ కనెక్షన్ తీసుకోవడం వెనుక స్థానిక అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో జాడ లేని పర్యావరణ అనుమతి పత్రాలు
చట్టబద్ధమైన ఎలాంటి అనుమతులు పొందకుండా, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కలిగించే విధంగా పచ్చని వ్యవసాయ భూమిలో ఆర్ఎంసి ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఎన్ హెచ్ 365-ఏ రోడ్డు పనులు నిర్వహిస్తున్న జి.ఎస్.ఆర్. ఆంధ్ర కన్స్ట్రక్షన్ కంపెనీ తీరుపై బాధితుడు గత మే నెలలోనే ఖమ్మం కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయకుండా, కేవలం 3 కుంటల నామమాత్రపు నాలా పర్మిషన్‌తోనే భారీ ఎత్తున ఆర్ఎంసి ప్లాంట్ స్థాపించి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాడని ఆ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అనధికారిక ప్లాంట్ నిర్వహణ వల్ల పరిసర ప్రాంతాల్లోని వాతావరణం దెబ్బతింటున్నదని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తమ ప్లాంట్‌కు జిల్లా పర్యావరణ శాఖ అన్ని అనుమతులు మంజూరు చేసిందని చెబుతూ జి.ఎస్.ఆర్. కంపెనీ యాజమాన్యం ఒక పత్రాన్ని అందరికీ చూపుతోంది. కానీ, ఆశ్చర్యకరంగా తెలంగాణ పర్యావరణ శాఖ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రం ఆ అనుమతి పత్రానికి సంబంధించిన ఎలాంటి రికార్డులు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమాలన్నింటి వెనుక స్థానిక పంచాయతీ కార్యదర్శి పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి. ఎలాంటి పంచాయతీ ఎన్ఓసిలు లేకపోయినా, మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోయినా, కాంట్రాక్టర్ మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. హైవే పనుల పేరుతో సమీప ప్రాంతాల్లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమంగా నడుస్తున్న ఈ ఆర్ఎంసి ప్లాంట్‌పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

