ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్. మదార్ గౌడ్
మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు వేగవంతం చేయాలని సూచన
కాకతీయ, నెల్లికుదురు : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్. మదార్ గౌడ్ అన్నారు. బుధవారం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆయన, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కాలర్‌షిప్‌లు తదితర సంక్షేమ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం కళాశాల మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, మైనర్ రిపేర్ పనుల పురోగతిపై ప్రిన్సిపాల్ కె. వీరస్వామిని అడిగి తెలుసుకుని, అవసరమైన మరమ్మతు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ కె. వీరస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు పంపిణీ చేసిన నోట్‌బుక్స్ విద్యాభ్యాసానికి ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

