మణుగూరులో అనధికార ఇసుక ర్యాంపులు
రైతు లేని గ్రామానికి ఇసుక ర్యాంపులు ఎలా…?
సింగరేణి భూముల్లో ఇసుక మాఫియా తవ్వకాలు
టీజీఎండీసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు 5% వాటాలున్నాయని ఆరోపణలు
కలెక్టర్ ను నమ్మించి ప్రభుత్వ ఖజానా పక్కదారి
జీవో ఉల్లంఘించి ర్యాంపులకు గ్రీన్ సిగ్నల్
బయట వ్యక్తుల పేరుతో నకిలీ సొసైటీలు
నిత్యం వందల లారీలు – ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
అర్ధరాత్రులు జీరో లారీల దందా
ఉన్నతాధికారులు ఉన్నట్టా..లేనట్టా అని ప్రజల ఆగ్రహం
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఒకప్పుడు జనజీవనంతో కళకళలాడిన గుండ్లసింగారం, కొమ్ముగూడెం, శివాజీనగర్ గ్రామాలు… నేడు సింగరేణి గనుల విస్తరణలో భాగంగా చరిత్రలో కలిసిపోయాయి. రెండు నుంచి మూడు దశాబ్దాల క్రితమే ఈ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించి, ప్రతి ఇంటికి, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు పరిహారం చెల్లించి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఆ భూములన్నీ సింగరేణి ఆధీనంలో ఉన్నాయి. ఒక్క ఇల్లు లేదు… ఒక్క రైతు లేడు… ఒక్క ఎకరం సాగు భూమి లేదు. కానీ ఆశ్చర్యకరంగా అదే గ్రామాల పేరుతో నేడు ఇసుక ర్యాంపులు గర్జిస్తున్నాయి. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. జీవో ప్రకారం గ్రామాలు ఉండాలి… స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ర్యాంపులు మంజూరు కావాలి. అలాంటిది అసలు గ్రామాలే లేని చోట, రైతులే లేని చోట, గిరిజనులే లేని చోట ఇసుక ర్యాంపులకు అనుమతులు ఎలా వచ్చాయన్న ప్రశ్న ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

జీవోలను తుంగలో తొక్కి ర్యాంపులకు గ్రీన్‌సిగ్నల్..?
గుండ్లసింగారం, కొమ్ముగూడెం, శివాజీనగర్ గ్రామాల ప్రజలను సింగరేణి విస్తరణ కోసం గతంలో పూర్తిగా తరలించిన విషయం అధికారిక రికార్డుల్లోనే ఉంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు ఉన్నట్లు, గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నట్లు కాగితాలపై చూపించి జిల్లా యంత్రాంగాన్ని నమ్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలే లేని చోట రైతు సంఘాలు ఎలా ఏర్పడ్డాయి? రైతులే లేని చోట గిరిజన సొసైటీలు ఎలా నమోదయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేకుండానే అనుమతులు మంజూరు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ జీవోలను పక్కనబెట్టి, వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ర్యాంపులకు అనుమతులు ఇచ్చారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వ భూములనే ప్రైవేటు దోపిడీకి వేదికగా మార్చారనే ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

ఆంధ్ర కాంట్రాక్టర్లతో మూడు శాఖల కుమ్మక్కు..?
ఈ వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇసుక కాంట్రాక్టర్ల హస్తం ఉందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు కళ్లుమూసుకుని పూర్తి సహకారం అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పగటిపూట అనుమతుల పేరుతో… రాత్రివేళల్లో ‘జీరో లారీల’ పేరుతో 24 గంటలూ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని చెబుతున్నారు. లెక్కల ప్రకారం ఒక్కో ర్యాంపులో సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ ఉందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు. టీజీఎండీసీ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల కొందరు అధికారులకు 5 శాతం వాటా అందుతోందనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారిక స్పందన మాత్రం లేదు.

లేని గ్రామాల పేరుతో నకిలీ సొసైటీలు..?
ఈ వ్యవహారంలో అత్యంత సంచలన అంశం నకిలీ సొసైటీల వ్యవహారమే. గుండ్లసింగారం, కొమ్ముగూడెం, శివాజీనగర్ గ్రామాల్లో ప్రస్తుతం ఒక్క కుటుంబం కూడా నివసించడం లేదు. అలాంటప్పుడు ఆ గ్రామాల పేరుతో గిరిజన సొసైటీలు ఎలా ఏర్పడ్డాయి? అనే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. స్థానిక గిరిజన రైతుల పేరుతో కాకుండా, ఇతర ప్రాంతాల వ్యక్తులను సభ్యులుగా చూపించి నకిలీ సొసైటీలు సృష్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగితాలపై మాత్రం పూర్తిగా గిరిజనుల సొసైటీగా చూపించి ప్రభుత్వాన్ని నమ్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గిరిజనుల ఉపాధి పేరుతో కోట్ల రూపాయల ఇసుకను కొద్దిమంది వ్యక్తులు దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ సొసైటీల వెనుక ఎవరు ఉన్నారు? ఎంత మొత్తం చేతులు మారింది? అనేదానిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
జీరో లారీల దందాకు పోలీసులే సాక్ష్యం
మణుగూరులో అక్రమ ఇసుక రవాణా ఏ స్థాయిలో జరుగుతోందో ఇటీవల పట్టుబడ్డ లారీ వ్యవహారం స్పష్టం చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి TS 28 T 6489 నంబర్ గల అశ్వాపురానికి చెందిన లారీ అక్రమంగా జీరో ఇసుక తరలిస్తుండగా మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. ఇదే లారీ కొన్ని రోజుల క్రితం సీతారామ ప్రాజెక్టు పరిధిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండగా కూడా పట్టుబడిందని సమాచారం. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే మళ్లీ అదే లారీ ఇసుక దందాలో పట్టుబడేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకే వాహనం వరుసగా అక్రమ రవాణాలో చిక్కుకోవడం వెనుక ఎవరి అండ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తహసీల్దార్ వివరణ ఇలా..
ఈ వ్యవహారంపై మణుగూరు తహసీల్దార్ స్పందిస్తూ గుండ్లసింగారం, కొమ్ముగూడెం, శివాజీనగర్ ప్రాంతాలు గతంలోనే సింగరేణి పరిధిలోకి వెళ్లాయని, ప్రస్తుతం అక్కడ ప్రజలు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపులకు తాను అనుమతులు ఇవ్వలేదని, గత తహసీల్దార్ హయాంలోనే అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇటీవల పద్మగూడెం ర్యాంపుకు అనుమతి కోరుతూ వచ్చిన ఓ కాంట్రాక్టర్ తనను డబ్బులతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని, “మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా… సంతకం చేయండి” అని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. అనుమతి నిరాకరించడంతో తనపై నిరాధార ఆరోపణలు చేశాడని కూడా చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదే కాంట్రాక్టర్ ఓ కేసులో జైలుకు వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు మణుగూరు మున్సిపాలిటీ అధికారులు గుండ్లసింగారం, పద్మగూడెం, కొమ్ముగూడెం, శివాజీనగర్ ప్రాంతాలు మున్సిపల్ పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ ప్రస్తుతం ఎలాంటి నివాసాలు లేవని స్పష్టం చేశారు. ఇసుక ర్యాంపులకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేదా ఎన్ఓసీలు ఇవ్వలేదని వెల్లడించారు. గుండ్లసింగారం, పద్మగూడెం, కొమ్ముగూడెం, శివాజీనగర్ ప్రాంతాల్లోని ర్యాంపులకు అనుమతులు ఉన్నాయా? పోలీసులకు పట్టుబడ్డ జీరో ఇసుక లారీపై టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ (మైనింగ్)ల వివరణ ఏమిటి? అనే అంశాలపై స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ వారు ఫోన్‌కు స్పందించకపోవడం గమనార్హం. ఇసుక దందాపై ఒకవైపు తీవ్ర ఆరోపణలు… మరోవైపు సంబంధిత శాఖల మౌనం… లేని గ్రామాలకు ర్యాంపుల అనుమతులు… నకిలీ సొసైటీల ఆరోపణలు… రాత్రివేళ్ల జీరో లారీల అక్రమ రవాణా… ఇవన్నీ కలిసి మణుగూరులో జరుగుతున్న ఇసుక వ్యవహారంపై సమగ్ర, ఉన్నతస్థాయి విచారణ జరపాల్సిన అవసరాన్ని బలంగా చాటుతున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

