కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం
వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
ఆరు గ్యారంటీలు.. 420 హామీలతో ప్రజలను వంచించారు
రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు
కేసీఆర్ రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ నిరసన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. రైతు రుణమాఫీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టి, రైతుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు మోసపోవడం ఖాయమని కేసీఆర్ ముందుగానే హెచ్చరించారని గుర్తుచేశారు.

విద్యార్థులు, కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురుకుల విద్యార్థులు సైతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. గతంలో ఖమ్మం జిల్లాలో ఒక్క మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ, మిగిలిన పనుల పూర్తి విషయంలో శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

కేసీఆర్ రావడం పక్కా.. రామరాజ్యం ఖాయం
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కేసీఆర్ తిరిగి రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. ఖమ్మం జర్నలిస్టుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని ఇప్పటికీ వారికి కేటాయించలేకపోయారని పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు.


