తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష
కుటుంబ వివాదంతో ఆడబిడ్డ ఆవేదన
తండ్రి తనను దూరం పెట్టారని యువతి ఆరోపణ
న్యాయం కోసం భద్రాచలంలో దీక్షకు కూర్చున్న కూతురు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : తండ్రి ప్రేమ కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మధ్య కుటుంబ వివాదం కారణంగా తనను తండ్రి దూరం పెడుతున్నారని ఆరోపిస్తూ యువతి న్యాయం కోసం దీక్షకు కూర్చుంది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై.. తండ్రి ప్రేమ కోసం ఓ కూతురు కన్నీటి పోరాటానికి దిగడం పలువురిని కలచివేస్తోంది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రుల కుటుంబ వివాదం కారణంగా తనను తండ్రి దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తనను దగ్గరకు రానివ్వడం లేదని ఆరోపించింది. తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని తండ్రి చెబుతున్నారని పేర్కొంది. తన తల్లిని తండ్రి మానసికంగా వేధించి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చేర్పించారని యువతి ఆరోపించింది. తనకు ఎలాంటి సమస్య లేదని నిరూపించుకుని తల్లి ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారని తెలిపింది. కొన్నేళ్లుగా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ప్రభావశీల వ్యక్తుల అండతో తాము ఎక్కడికి వెళ్లినా న్యాయం దక్కడం లేదని, చివరకు తన తండ్రి ప్రేమ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి ప్రేమ కోసం ఓ కూతురు రోడ్డుపైకి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కుటుంబ వివాదంపై అధికారులు స్పందించి, యువతి చేస్తున్న ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

