అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు పకడ్బందీగా నోటీసులు
ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల నోటీసుల జారీకి ప్రణాళిక
ఇప్పటికే 75 వేల నోటీసులు జనరేట్
80 వేల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు
నోటీసుల్లో విచారణ తేదీ, సమయం, ప్రదేశం స్పష్టంగా పేర్కొనాలి
ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం : అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు కలిపి సుమారు 1.75 లక్షల నోటీసులు జారీ చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 75 వేల నోటీసులు జనరేట్ చేసినట్లు చెప్పారు. అనామలీస్ కింద సుమారు 80 వేల మంది ఓటర్ల పేర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు వివరించారు. నోటీసులు జారీ చేసే సమయంలోనే విచారణకు సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, సమయం, ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొనాలని, నోటీసు జారీకి–విచారణకు మధ్య కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండాలని ఆదేశించారు. నోటీసుల వివరాలను బీఎల్ఓ యాప్‌లో ఫొటోతో నమోదు చేయడంతో పాటు, విచారణ వివరాలు, ఓటర్లు సమర్పించిన ఆధారాలను అప్లోడ్ చేయాలని సూచించారు.

