ఎంజీఎంలో ఇదేం పచ్చదనం..?
రోగుల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలా… దోమలకు పుట్టినిల్లా..?
వార్డుల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలతో పరిశుభ్రతపై ప్రశ్నలు
రోడ్డుపైనే పడేసిన మాస్కులు.. కిటికీలపై వేలాడుతున్న బెడ్షీట్లు, గౌన్లు
దోమలు, మురుగు, చెత్తతో రోగులు–సహాయకుల ఆందోళన

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలల్లో ఒకటైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరిశుభ్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోగులకు ఆరోగ్యాన్ని అందించాల్సిన ఆస్పత్రి ఆవరణలోనే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోందని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల మధ్య ఖాళీ స్థలాల్లో అదుపు లేకుండా పెరిగిన మొక్కలు, పేరుకుపోయిన చెత్త, పలు చోట్ల కనిపిస్తున్న వ్యర్థాలతో దోమలు విస్తరించే పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పచ్చదనం పేరుతో పెరిగిన మొక్కలు ఔషధమొక్కలా..? లేక పిచ్చిమొక్కలా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పచ్చదనమా… నిర్లక్ష్యమా..?
ఆస్పత్రి వార్డుల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగిన మొక్కలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, వాటి నిర్వహణ లేకపోవడంతో అవి దోమలకు ఆశ్రయంగా మారే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంటే దోమల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం క్రమం తప్పకుండా శుభ్రపరిచే చర్యలు చేపడుతున్నదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని వార్డుల కిటికీలకు వాడేసిన బెడ్షీట్లు, గౌన్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వైద్య వ్యర్థాలు, చెత్త పేరుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రత, మురుగు నీటి పారుదల, చెత్త తొలగింపుపై కూడా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్డుపైనే మాస్కులు
ఆస్పత్రి ఆవరణలో ఉపయోగించిన మాస్కులు రోడ్డుపై పడేయడం ఆందోళన కలిగిస్తోంది. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి వచ్చే వేలాది మంది రోగులు, సహాయకులు నడిచే దారుల్లోనే ఇలాంటి వ్యర్థాలు కనిపించడం విమర్శలకు తావిస్తోంది. ఎంజీఎం వంటి అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశుభ్రత, దోమల నివారణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. వార్డుల మధ్య పెరిగిన మొక్కలను శాస్త్రీయంగా నిర్వహించడం, చెత్తను వెంటనే తొలగించడం, మురుగు నీరు నిల్వ కాకుండా చూడడం, దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోగులకు వైద్యం అందించే ఆస్పత్రి పరిసరాలే ఆరోగ్యానికి ముప్పుగా మారకుండా జిల్లా వైద్యాధికారులు, ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

