వరి నాట్లకు వచ్చి.. వలస కూలీ మృతి
కారు ఢీకొని పశ్చిమ బెంగాల్ యువకుడికి తీవ్ర గాయాలు
ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
ప్రమాదానికి కారణమైన కారు కోసం పోలీసుల గాలింపు
కాకతీయ, రాయపర్తి : జీవనోపాధి కోసం సొంతూరును వదిలి వందల కిలోమీటర్లు వచ్చిన ఓ వలస కూలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరి నాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి రాయపర్తికి వచ్చిన సత్యం (25) గురువారం రాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సత్యం నెల రోజుల క్రితం తోటి కూలీలతో కలిసి వరి నాట్ల పనుల కోసం రాయపర్తి మండలానికి వచ్చాడు. గురువారం రాత్రి మండల కేంద్రంలోని అంగడిలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడు. అనంతరం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి దాటుతుండగా ఖమ్మం నుంచి వరంగల్ వైపు వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని కారు అదుపుతప్పి అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యం తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో సత్యాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును గుర్తించే పనిలో ఉన్నారు.

