పైసలిస్తేనే పని.. లేదంటే ఫైలు పెండింగ్
మ్యుటేషన్ నుంచి వారసత్వ మార్పిడి వరకు ఇదే కథ
ధ్రువీకరణ పత్రాలకూ ‘రేటు’
భూమి వ్యవహారాల్లో మధ్యవర్తుల హవా
తనిఖీలు ఉన్నా.. తగ్గని వసూళ్లు
జనగామలో బాధితులకు ముప్పతిప్పలు
కాకతీయ,నిఘా ప్రతినిధి : జనగామ జిల్లాలోని మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాలు, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొన్ని పనులకు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పూర్తి కావాల్సిన పనులు సైతం ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం.. పైసలు ముట్టజెప్పిన తర్వాతే కదిలించడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూముల మ్యుటేషన్, వారసత్వ మార్పిడి, పట్టాదారు పాస్‌బుక్ సంబంధిత పనులు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తదితర సేవల్లో అక్రమ వసూళ్లకు ఆస్కారం ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తుల్లో చిన్నచిన్న లోపాలను చూపుతూ ప్రజలను పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిప్పడం.. మధ్యవర్తుల ద్వారా పని చేయించుకుంటే మాత్రం త్వరగా పూర్తిచేయడం జరుగుతోందని పలువురు చెబుతున్నారు.
భూమి పనులకే ఎక్కువ డిమాండ్
రెవెన్యూ కార్యాలయాల్లో భూములకు సంబంధించిన వ్యవహారాలే ప్రధానంగా అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన భూమిని కుటుంబ సభ్యుల పేర్లపై మార్చడం, రికార్డుల్లో మార్పులు చేయడం, భూ వివరాల పరిశీలన, ధ్రువీకరణ, వివిధ రకాల నివేదికల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ‘ఖర్చులు’ పేరుతో డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పని ఆలస్యమవుతుందని చెప్పి ఒత్తిడి చేయడం.. చివరకు ఎంతోకొంత ఇచ్చిన తర్వాత ఫైలు ముందుకు కదులుతుందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే మధ్యవర్తుల వ్యవస్థ కూడా అవినీతికి ఊతమిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు నేరుగా అందాల్సిన సేవలకు కూడా మధ్యవర్తుల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. దరఖాస్తు నుంచి ఫైలు క్లియరెన్స్ వరకు ఒక్కో దశకు ఒక్కో రేటు నిర్ణయించినట్లుగా వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు ఉన్నా.. తగ్గని వసూళ్లు
రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలకు అందాల్సిన సేవలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో అందించడంతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బంది, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పరిశీలించి, ప్రతి సేవకు నిర్ణయించిన రుసుము, సమయ పరిమితిని కార్యాలయాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.

