రేషన్ బస్తాల్లో నూకల మయం
పేదోడి బియ్యం పై పట్టింపు లేదా?
వరంగల్, ఖిలా వరంగల్‌లో నాణ్యతలేని బియ్యం పంపిణీ
50.650 కిలోలకు బదులు 45 కిలోలు
లెక్కలు సరిపోక డీలర్లు, ప్రజలు ఇద్దరూ నష్టంలో
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : “ఉచితం కదా అని ఏది పడితే అది ఇస్తారా?” అంటూ వరంగల్, ఖిలా వరంగల్ మండలాల ప్రజలు ప్రభుత్వంపై, సివిల్ సప్లై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత కనిపించడం లేదు. చల్లగోదాముల నుంచి వస్తున్న బస్తాలు తెరిస్తే బియ్యానికి బదులు సగానికి సగం నూకలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం పంపిణీపై పర్యవేక్షణ ఉందని, ప్రతి బస్తాను పరిశీలించే సప్లై చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

చల్లగోదాము నుంచి నేరుగా నూకలా?
గత కొంతకాలంగా రేషన్ డీలర్లకు సరఫరా అవుతున్న బస్తాల్లో నాణ్యత తీవ్రంగా పడిపోయిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బస్తా విప్పగానే ధూళిలా నూకలు వస్తున్నాయి. వండితే ముద్దగా అవుతోందని, పిల్లలు సైతం తినలేకపోతున్నారని ఓ లబ్ధిదారుడు వాపోయాడు. సివిల్ సప్లై డిటి, అధికారులు ప్రతి లారీని చెక్ చేస్తామంటారు. మరి ఇన్ని నూకల బస్తాలు ఎలా వస్తున్నాయి? గోదాములోనే మార్పిడి జరుగుతుందా? అని ప్రజలు నిలదీస్తున్నారు. పేదలకు ఇచ్చేది కాబట్టి ఎవరూ పట్టించుకోవడం లేదనే భావనతో అధికారులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

బరువులోనూ భారీ కోత..డీలర్లకు చుక్కలు
రేషన్ సరఫరాలో నాణ్యత ఒక్కటే కాదు, బరువులోనూ గోల్‌మాల్ జరుగుతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రేషన్ షాపులకు వచ్చే ప్రతి బస్తా 50 కిలోల 650 గ్రాములు ఉండాలి. కానీ వస్తున్న బస్తాల్లో కొన్ని 45 నుంచి 46 కిలోల మధ్యే ఉంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం మాకు 50.650 కిలోల లెక్కన బియ్యం ఇస్తుంది. కానీ బస్తాలో 4-5 కిలోలు తక్కువ వస్తే ఆ నష్టం ఎవరు భరిస్తారు? లబ్ధిదారులకు పూర్తి కోటా ఇవ్వలేక మాటలు పడుతున్నామని ఓ డీలర్ ఆవేదన చెందారు. దీంతో లెక్కలు సరిపోక, పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు.


పేదోడి కడుపు కొట్టొద్దు – వెంటనే చర్యలు తీసుకోండి
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు అందిస్తున్న పథకం ఇది. కానీ మధ్యలోనే నాణ్యత, బరువు విషయంలో జరుగుతున్న అక్రమాల వల్ల అసలు లబ్ధిదారులకే నష్టం జరుగుతోంది.
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకానికి ఇదేనా నిదర్శనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పుక్కిటికి ఇచ్చేది కాబట్టి పట్టించుకోవడం లేదు. అదే మార్కెట్‌లో అమ్మే బియ్యం అయితే ఇలా ఇస్తారా? అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, చల్లగోదాముల నుంచి జరిగే ప్రతి సప్లైని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యత, బరువులో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

