108 గ్రామాలు.. మిషన్ భగీరథకు రూ.20.96 కోట్లు
ములుగు నియోజకవర్గంలో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆమోదం
ములుగు, కొత్తగూడ, గంగారం మండలాల్లో పనులు
ఓహెచ్ఎస్ఆర్లు, పైప్లైన్లు, బోర్వెల్ల నిర్మాణం
భూగర్భ జలాల లభ్యతపై సమగ్ర సర్వే
నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశం
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 108 గ్రామాలు, ఆవాసాల్లో మిషన్ భగీరథ పనులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.20 కోట్ల 96 లక్షల 49 వేల నిధులను మంజూరు చేసింది. ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నెం.428ను విడుదల చేసింది. ములుగు నియోజకవర్గంలోని పలు మారుమూల గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి సమస్య ఏళ్లుగా ప్రజలను వేధిస్తోంది. ముఖ్యంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అదనపు, ప్రత్యామ్నాయ తాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 108 గ్రామాలు, ఆవాసాల్లో మిషన్ భగీరథ నిధులతో వివిధ మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది.
రూ.20.96 కోట్లతో పనులు
మిషన్ భగీరథ పనుల కోసం ప్రభుత్వం రూ.20 కోట్ల 96 లక్షల 49 వేల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా తాగునీటి మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఉన్న సరఫరా వ్యవస్థకు అదనంగా ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో తాగునీటి సరఫరాలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో నీటి కొరత ఎదురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన వసతులను కల్పించనున్నారు. మంజూరైన నిధులతో అవసరమైన ప్రాంతాల్లో ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు (ఓహెచ్ఎస్ఆర్లు), పైప్లైన్లు, బోర్వెల్లు తదితర పనులు చేపట్టనున్నారు. నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేలా పైప్లైన్లను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన చోట్ల బోర్వెల్లను కూడా నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ప్రస్తుతం తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. నీటి వనరుల లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.
భూగర్భ జలాలపై సర్వే
పనులు ప్రారంభించే ముందు ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల లభ్యతపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్వెల్ల నిర్మాణానికి ముందు నీటి లభ్యతను శాస్త్రీయంగా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే మిషన్ భగీరథ పనుల నిర్మాణంలో నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించింది. నీటి వనరుల ఎంపిక, నిర్మాణాల రూపకల్పన, పైప్లైన్ల ఏర్పాటు తదితర అంశాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. మంజూరైన పనులను గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకుంటూ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పనుల నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించింది. మిషన్ భగీరథ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందేలా మౌలిక వసతులను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రతిపాదిత పనులు పూర్తయితే ములుగు నియోజకవర్గంలోని 108 గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

