అక్రమాలకు తావు లేకుండా నూతన పెన్షన్‌దారుల ఎంపిక
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా చర్యలు
క్షేత్రస్థాయిలో అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలి
దళారులను ఆశ్రయించొద్దు.. నేరుగా దరఖాస్తు చేసుకోవాలి
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్
కాకతీయ, గీసుగొండ :చేయూత పెన్షన్లలో నూతన పెన్షన్‌దారుల ఎంపికను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను మండలంలోని కొనాయిమాకుల రైతువేదికలో అధికారులు, సర్పంచులు వీక్షించారు. క్షేత్రస్థాయిలో అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కమిషనర్ సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు, కల్లుగీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, దివ్యాంగులు తదితర విభాగాల్లో అర్హులను గుర్తించి ఈ నెల 31వ తేదీలోగా తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సాంకేతిక కారణాలతో నష్టపోకుండా చూడాలన్నారు.
దళారులను ఆశ్రయించొద్దు
పెన్షన్ కోసం దళారులను ఆశ్రయించకుండా నేరుగా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రజలకు సూచించారు. పెన్షన్లు ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారుల ప్రమేయం తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవో వెన్నె కృష్ణవేణి, సూపరింటెండెంట్ కమలాకర్, సర్పంచులు రడం భరత్‌కుమార్, వజ్ర రాజు, వీరన్న, వీరేందర్, సుభాష్, రాఘవేంద్ర, వనిత, స్వప్న, యమున, జ్యోతి, దివ్య భారతి, అమృత, కమల, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

