ఖమ్మంలో 16న సమూహ రాష్ట్ర మహాసభ
ప్రజాస్వామ్య, సాంస్కృతిక సంభాషణపై చర్చ
బహుళ సాంస్కృతిక అస్తిత్వంపై సదస్సు
రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం : జీవన్, స్పర్శ భాస్కర్
కాకతీయ, ఖమ్మం టౌన్ : సెక్యులర్ రైటర్స్ ఫోరం సమూహ రెండో రాష్ట్ర మహాసభ ఈ నెల 16న ఖమ్మంలోని వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు వేదిక బాధ్యులు తెలిపారు. శుక్రవారం మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ కవి జీవన్, కరపత్రాన్ని స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు స్పర్శ భాస్కర్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య సాంస్కృతిక సంభాషణ, బహుళ సాంస్కృతిక అస్తిత్వం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక విలువలను కాపాడాలనే లక్ష్యంతో మహాసభలు నిర్వహిస్తున్నట్లు జీవన్, భాస్కర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రజాస్వామ్య సాంస్కృతిక సంభాషణపై జరిగే సదస్సులో ప్రముఖ కవి, విశ్లేషకుడు ప్రసేన్ ప్రారంభోపన్యాసం చేస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యం, పౌరసత్వ సమస్యలు, సవాళ్లపై జహాఅరా, సాహిత్యంలో బహుళ అస్తిత్వాలపై జీలుకర శ్రీనివాస్, వర్తమాన సామాజిక సందర్భం, సమూహ ఆచరణపై ఆర్. సీతారాం ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
మెట్టు రవీందర్, పసునూరి రవీందర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి వివిధ సదస్సులకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలతో కూడిన భారతదేశ నిర్మాణానికి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీతారాం, ప్రసేన్, రమేష్‌కుమార్, ఫణి, మాధవి, కన్నోజు, సుభాషిణి, చిర్రా రవి తదితరులు పాల్గొన్నారు.

