తాడ్వాయి–పస్ర మధ్య ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని కారులో ఇద్దరు మృతి.. తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద ఘటన
మృతుల్లో వరంగల్ ఏనుమామల మార్కెట్‌కు కొత్తగా వచ్చిన డీఎంఓ సురేఖ
కాకతీయ, ఏటూరునాగారం : తాడ్వాయి–పస్ర మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. పస్ర వైపు నుంచి తాడ్వాయి వైపు వస్తున్న కారును ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మహిళను వరంగల్ ఏనుమామల మార్కెట్‌కు కొత్తగా వచ్చిన డీఎంఓ సురేఖగా గుర్తించినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన ఆమె, తాజాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తెలిసింది.

