కాంట్రాక్టర్ ఏం తమాషాగా ఉందా!
ఆగస్టు 15 గడువు దాటినా మారెళ్లపాడు పనులు పూర్తి కాలేదెందుకు?
అధికారులు పనిచేస్తున్నారా.. ఆడుకుంటున్నారా?
లిఫ్ట్ పనులకు అడ్డంకుల్లేకున్నా జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం
నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలంటూ అల్టిమేటం
రైతుల జీవితాలతో ఆటలాడొద్దని హెచ్చరిక
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఆగస్టు 15లోగా రైతులకు సాగునీరు అందించాల్సిన మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు గడువు దాటినా పూర్తికాకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ సమస్య లేదు.. నిధుల కొరత లేదు.. పనులకు ఎలాంటి అడ్డంకులూ లేవు.. అయినా పనులు ఎందుకు పూర్తికాలేదంటూ అధికారులను, గుత్తేదారులను నిలదీశారు. “కాంట్రాక్టర్ ఏం తమాషాగా ఉందా? గడువు దాటినా పనులు ఎందుకు పూర్తి కాలేదు?” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారా.. లేక పనులను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పనులను వేగవంతం చేసి సాగునీరు అందించాలని ఆదేశించారు. అశ్వాపురం మండలం మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి అధికారులతో సమీక్షించారు. గతంలోనే ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని గడువు విధించినా.. ఆ గడువు ముగిసే నాటికి పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులకు భూసేకరణ, నిధుల సమస్యలు లేనప్పుడు ఇక జాప్యానికి కారణమేంటని ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా కాంట్రాక్టర్ను అధికారులు ఎందుకు ఒత్తిడి చేయలేదని నిలదీశారు. రైతులకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టు పనుల్లో కాలయాపన చేస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూరుస్తున్నప్పటికీ పనులు నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ఆటలాడొద్దని.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందే
మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు, గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులకు ఎవరైనా కావాలని అడ్డుపడితే పోలీసుల సహకారంతోనైనా పనులు కొనసాగించాలని ఆదేశించారు. పనుల్లో రాజకీయ జోక్యం ఉంటే తగిన విధంగా స్పందిస్తామని మంత్రి హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును ఇకనైనా ఆలస్యం చేయకుండా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో పనుల పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తానని స్పష్టం చేశారు. నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాలని మంత్రి తేల్చిచెప్పారు.

