ఆధార్ పార్టీతోనే బడుగులకు న్యాయం
బీసీల ఐక్యతే సమాజ ప్రగతికి బలమైన పునాది
2028 ఎన్నికల్లో అధికారమే ప్రధాన లక్ష్యం
119 నియోజకవర్గాల్లో పోటీకి కార్యాచరణ
యువతకు పార్టీలో అవకాశాలు కల్పిస్తాం: డా. ఈడ శేషగిరిరావు
కాకతీయ, హనుమకొండ : బహుజనులు రాజకీయ కూలీలు కాదని, ఆధార్ పార్టీతోనే బడుగులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది డా. ఈడ శేషగిరిరావు అన్నారు. బీసీల ఐక్యతే సమాజ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. బుధవారం హనుమకొండలోని నేచర్ 369 హోటల్‌లో నిర్వహించిన ఆధార్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆధార్ పార్టీ పనిచేస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించడంతో పాటు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీసీలకు వారి జనాభా నిష్పత్తి మేరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని, సమాజ అభ్యున్నతి కోసం సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే ఆసక్తి ఉన్న యువతకు ఆధార్ పార్టీలో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు గట్ల యుగేందర్ గౌడ్, ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ చైర్మన్ ఆంబోజు బుడ్డయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బండా రాజారాం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధు, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నీరటి సత్యం, జెట్టి శ్రీనివాస్, మల్లేష్, ప్రేమ్ దయిల్, బూర సైదారావు, నక్క అజయ్ పద్మశాలి తదితరులు పాల్గొన్నారు.

