ప్రజావాణి ఫిర్యాదుకు స్పందించిన జిల్లా విద్యాధికారి
గంభీరావుపేట జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల పరిశీలన
180 మంది విద్యార్థులకు నాలుగు వాష్‌రూమ్‌లతో ఇబ్బందులు
మరుగుదొడ్ల సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టాలని సూచనలు
నీటి వసతి, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ల పనితీరుపై ఆరా
కాకతీయ, గంభీరావుపేట : ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాధికారి శ్రీమొండయ్య బుధవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పరిశీలించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. పాఠశాలలో సుమారు 180 మంది విద్యార్థులు ఉండగా, వారికి కేవలం నాలుగు వాష్‌రూమ్‌లు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. బాలురు, బాలికలు వేర్వేరుగా వాటిని వినియోగించాల్సి ఉండటంతో విద్యార్థులకు అసౌకర్యం కలుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వెస్ట్రన్ టాయిలెట్ల వినియోగంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, వాటి స్థానంలో అవసరమైన మార్పులు చేపట్టేందుకు సూచనలు చేశారు.
నీటి సమస్యకు పరిష్కారం
పాఠశాలలో నీటి లభ్యతపై ఆరా తీసిన డీఈఓ, తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను మెరుగుపరచాలని తెలిపారు. అదేవిధంగా కంప్యూటర్ల పనితీరు, మధ్యాహ్న భోజన వసతులు, ఆహార నాణ్యత, పరిమాణంపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట స్థానిక ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

