జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి
రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
3,245 ఎకరాల్లో పారిశ్రామిక నగర అభివృద్ధి
2028 మార్చి నాటికి పనులన్నీ పూర్తి
నీటి సరఫరా టెండర్ల ప్రక్రియ పూర్తి
తెలంగాణకు 4 ప్లగ్ అండ్ ప్లే పార్కులు ఇవ్వాలి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాకతీయ, హైదరాబాద్ : జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక ప్రయోజన వాహనం సంస్థకు అభివృద్ధి ప్రణాళికను అందజేశామని చెప్పారు. ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ పద్ధతిలో జరుగుతున్న పనులను ముందుగా నిర్ణయించిన గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
మౌలిక వసతుల పనులు గడువులోగా
స్మార్ట్ సిటీకి నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని శ్రీధర్‌బాబు తెలిపారు. విద్యుత్తు సరఫరా పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. పారిశ్రామిక సంస్థలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. భవ్య పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్‌ను శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం మరింత సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్సులో టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో టి–వర్క్స్ తరహా సంస్థ
అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన న్యూఢిల్లీ పరిశ్రమల మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో టి–వర్క్స్ తరహా సంస్థను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని సిర్సా, శ్రీధర్‌బాబును కోరారు.

