గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
తాగునీటి బావులు, బోర్లకు సోలార్ విద్యుత్ వినియోగించాలి
నీటి సమస్యలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రతిపాదనలు పంపాలి
గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్
కాకతీయ, ఇనుగుర్తి : ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సూచించారు. బుధవారం ఇనుగుర్తి రైతువేదికలో సర్పంచులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీల్లో స్ట్రీట్‌లైట్లతో పాటు రక్షిత మంచినీటి బావులు, బోర్లకు సోలార్ విద్యుత్ వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పాత బావులను పునరుద్ధరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బావులు, బోర్లు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి ఎద్దడి నివారణకు సరైన ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. చిన్ననాగారం సర్పంచ్ సుజాత యాకయ్య గ్రామంలోని రక్షిత మంచినీటి బావులకు సోలార్ మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. సోలార్ విద్యుత్ వినియోగిస్తే విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని, గ్రామాల్లో మోటార్లు, స్ట్రీట్‌లైట్లకు సోలార్ విద్యుత్‌ను వినియోగించడంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఆరుతడి పంటల వైపు రైతులు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోరారు. నీటి వినియోగం అధికంగా ఉండే వరి తదితర పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సారెస్పీ కాలువల పూడికతీత, చెట్ల తొలగింపు పనులకు నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు చేయించాలని సర్పంచులు కోరగా, కాలువల వద్ద అవసరమైన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో గుడిసెలు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు. సర్పంచులను అధికారులు గౌరవించి, వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. విద్యుత్ ఏఈ పనితీరుపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సమావేశాలకు గైర్హాజరవుతున్న అంశంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసి, సస్పెన్షన్‌కు చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, తహసీల్దార్ సుంకర శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఎంఏఓ షేక్ యాస్మిన్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

