రేపటి దేశ భవిష్యత్తు విద్యార్థులదే
నాణ్యమైన విద్య, వైద్య వసతులు కల్పించాలి
సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మురళినాయక్ సూచన
కాకతీయ, ఇనుగుర్తి : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్య, వసతి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహం, వంటగది, భోజనశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి చదువు, భోజనం, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తన దృష్టికి తీసుకురావాలని, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు చదువులో ముందంజలో ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, సర్పంచ్ కుమార్, సర్పంచులు ముదిరెడ్డి కళావతి శ్రీనివాసరెడ్డి, చెడుపాక సుజాత యాకయ్య, లక్ష్మీ వెంకన్న నాయక్, చిన్ని వెంకన్న, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

