పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగుల జేఏసీ నోటీసు
ఈనెల 27న ములుగు కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు పిలుపు
పీఆర్సీ అమలు.. ఆరు డీఏలు విడుదల చేయాలని డిమాండ్
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : జేఏసీ చైర్మన్ పోలు రాజు
కాకతీయ, ములుగు ప్రతినిధి : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ములుగు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ, జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథన్ కేకన్‌కు జేఏసీ నాయకులు మహాధర్నా నోటీసు అందజేశారు. జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో నాయకులు అధికారులను కలిసి నోటీసు ఇచ్చారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా హెల్త్ కార్డుల విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వి. యాకూబ్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి కందుల జీవన్‌కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి మేడి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

