అక్రమాలకు బల్దియా ప్రసన్నం!
సర్వే నంబర్లు మార్చి ఇంటి నంబర్లు కేటాయింపు
డిప్యూటీ కమిషనర్ సంతకంతో వివాదాస్పద ఉత్తర్వులు
గ్రీవెన్స్ ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం
బాధితులకు ‘కోర్టుకు వెళ్లాంటూ అధికారుల ఉచిత సూచన
డీసీ ప్రసన్నరాణి తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఒకే స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లు, ఇంటి నంబర్ల విషయంలో భిన్నమైన రికార్డులు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాశిబుగ్గ సర్కిల్ పరిధిలోని పైడిపల్లి శివారు కత్తెరశాల లక్ష్మీకాంత్ కాలనీలో 600 గజాల స్థలానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులకు గతంలో మంజూరైన ఇంటి నంబర్లను తొలగించి.. మరో వ్యక్తి పేరుతో ఇంటి నంబర్ కొనసాగించేందుకు డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి పేరుతో నోటీసులు జారీ కావడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయగా.. సమస్యను కోర్టులో తేల్చుకోవాలని డీసీ సూచించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పైడిపల్లి శివారు కత్తెరశాల లక్ష్మీకాంత్ కాలనీలోని సర్వే నంబర్ 624లో 600 గజాల స్థలాన్ని నీలారపు మంజుల, పెంచర్ల రాజు పటేల్, షేర్ల కుమారస్వామి కొనుగోలు చేసినట్లు వారు చెబుతున్నారు. సంబంధిత పత్రాల ఆధారంగా మ్యూటేషన్లు జరిగాయని, అప్పటి నుంచి ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ స్థలాన్ని వినియోగిస్తున్నామని పేర్కొంటున్నారు. మంజులకు 47-5-1395/1/4, రాజుకు 47-5-1395/1/3, కుమారస్వామికి 47-5-1395/1/5 ఇంటి నంబర్లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొంతకాలం తర్వాత రామసహాయం వెంకట్‌రెడ్డి అదే ప్రాంతంలోని ఇళ్లను చూపించి తన పేరుతో కొత్త ఇంటి నంబర్ పొందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన సర్వే నంబర్ 527/బిగా రికార్డుల్లో నమోదైనట్లు చెబుతున్నారు. దీనిపై అప్పటి డిప్యూటీ కమిషనర్ ఇసంపల్లి జోనాకు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం వెంకట్‌రెడ్డి ఇంటి నంబర్ రద్దు చేసినట్లు బాధితులు తెలిపారు.
మళ్లీ తెరపైకి పాత వివాదం
దాదాపు ఐదేళ్ల తర్వాత రెండు నెలల క్రితం కాశిబుగ్గ సర్కిల్ నుంచి బాధితులకు నోటీసులు రావడంతో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. వెంకట్‌రెడ్డి సమర్పించిన పత్రాలను పరిశీలించగా 527/బి సర్వే నంబర్లోని 600 గజాల స్థలానికి ఆయనే యజమాని, స్వాధీనదారుడిగా గుర్తించినట్లు నోటీసులో పేర్కొన్నారు. 2005లో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు, 2015–17 మధ్య ఎల్ఆర్ఎన్ పొందినట్లు, నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు అందులో ప్రస్తావించారు. దీంతో బాధితుల ఇంటి నంబర్లు తొలగించి వెంకట్‌రెడ్డి ఇంటి నంబర్‌ను కొనసాగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నట్లు వారు చెబుతున్నారు.
సర్వే రిపోర్టులో ఏముంది?
జూలై 13న తమ ఇంటి ప్రహరీ గోడను వెంకట్‌రెడ్డి కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా జూలై 18న కేసు నమోదైనట్లు తెలిపారు. అనంతరం ఇరువర్గాల వాదనల నేపథ్యంలో ఏసీ సర్వే నిర్వహించగా.. ఈ నెల 5న జరిగిన సర్వేకు సంబంధించి 14న ఇచ్చిన నివేదికలో స్థలం సర్వే నంబర్ 624/1/2కు సంబంధించినదిగా గుర్తించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ రిపోర్టుతోపాటు తమ హక్కు పత్రాలను కమిషనర్ గ్రీవెన్స్ సెల్లో సమర్పించినట్లు తెలిపారు. అక్కడే ఉన్న కాశిబుగ్గ సర్కిల్ డీసీ ప్రసన్నరాణికి కూడా వివరాలు అందించామని, అయితే ‘ఇది మా పరిధిలో లేదు.. కోర్టుకు వెళ్లండి’ అని సూచించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
రికార్డులపై విచారణ జరగాలి
తమకు గతంలో మంజూరైన ఇంటి నంబర్లను తొలగించి.. మరో సర్వే నంబర్‌కు చెందిన వ్యక్తి పేరుతో ఇంటి నంబర్ ఎలా కొనసాగిస్తారన్నదే బాధితుల ప్రధాన ప్రశ్న. ఒకవైపు సర్వే నివేదిక 624/1/2ను సూచిస్తుండగా.. మరోవైపు 527/బి ఆధారంగా వెంకట్‌రెడ్డి ఇంటి నంబర్‌ను కొనసాగించడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత మ్యూటేషన్ రికార్డులు, ఇంటి నంబర్ల కేటాయింపు ఫైళ్లు, సర్వే నివేదికలు, నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎన్ పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరుతున్నారు. తమ ఇంటి నంబర్లను పునరుద్ధరించి, వివాదాస్పద నిర్ణయాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంజుల, కుమారస్వామి, రాజు డిమాండ్ చేస్తున్నారు.

