ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!
గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు
అత్యవసర మరమ్మతులకు మట్టి కేటాయించాలని వినతి
త్వరలో రక్షణ చర్యలు చేపడతాం : అటవీ శాఖ అధికారి భూలక్ష్మి
కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండాలోని ఎల్లయ్యకుంట చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. చెరువుకు గండి పడటంతో ఎప్పుడు తెగిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండటంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరారు. ఈ మేరకు సర్పంచ్ భుక్య మోహన్, బీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు భుక్య గబ్బర్‌సింగ్ అటవీ శాఖ అధికారి భూలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. చెరువు తెగిపోతే గ్రామానికి తాగునీరు, రైతులకు సాగునీటితోపాటు వన్యప్రాణులకు నీటి వనరు దెబ్బతింటుందని తెలిపారు. గండికి తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన మట్టిని అత్యవసరంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేస్తే సమస్య తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. దీనిపై భూలక్ష్మి సానుకూలంగా స్పందించి, మరమ్మతులకు అవసరమైన మట్టిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

