అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
వైద్య ఆరోగ్య శాఖలో అంకితభావంతో సేవలు : డీఎంహెచ్‌ఓ డా. అప్పయ్య
కాకతీయ, వరంగల్ : వైద్య ఆరోగ్య శాఖలో 41 సంవత్సరాలు అంకితభావంతో సేవలందించిన వేముల అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. అప్పయ్య అన్నారు. హనుమకొండ జిల్లా విస్తరణ, మీడియా అధికారిగా పనిచేసిన అశోక్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడంలో, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని డా. అప్పయ్య కొనియాడారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్మోహన్‌రావు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖతోపాటు టీజీఓ అసోసియేషన్‌కు అశోక్‌రెడ్డి సేవలందించారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం, అవతరణ దినోత్సవాల సందర్భంగా శకటాల రూపకల్పనలో ఆయన సృజనాత్మకత అభినందనీయమన్నారు. జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస్ కుమార్ ఆయన సేవలను కొనియాడారు. అశోక్‌రెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డా. సిహెచ్ రాజారెడ్డి, డా. వెంకటరమణ, డా. మదన్‌మోహన్, డా. కృష్ణారావు, డా. రజిత, జయకుమార్, ఆకవరం శ్రీనివాస్, ప్రవీణ్, నవాజ్‌ఖాన్, కొప్పు ప్రసాద్, కిరణ్, శ్రీనివాస్, రామాంజనేయులు, నాగేశ్వరరావు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

