ప్రణాళికతోనే హైదరాబాద్ అభివృద్ధి
విద్య, ఉపాధి అవకాశాలకు నగరం ఆశ్రయం
రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం
సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అంబర్‌పేట–మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్య, ఉపాధి అవకాశాలకు హైదరాబాద్ ఆశ్రయంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌కు రావడం వల్లే నగరం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. అంబర్‌పేట–మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేటలోని స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చాదర్‌ఘాట్ వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు అంబర్‌పేటలో వంతెన ఎందుకు నిర్మించలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే హైలెవల్ బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో అంబర్‌పేటలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించినా పేదలకు ఇవ్వకుండా దళారులకు ఇచ్చారని ఆరోపించారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ పాలసీని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. మూసీ వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడినా గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అప్పును రూ.70 వేల కోట్ల నుంచి రూ.8.10 లక్షల కోట్లకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుతం నెలకు రూ.7 వేల కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పారు. రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిపోయారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు చెల్లించామని వివరించారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా కొనసాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
బతుకమ్మకుంటను ఆక్రమణల నుంచి కాపాడాం
అంబర్‌పేటలో పది ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువు లేకుండా బతుకమ్మకుంటను ఆక్రమించారని ఆరోపించారు. ఆక్రమణలను తొలగించి బతుకమ్మకుంటను తిరిగి ఆడబిడ్డలకు బహుమతిగా ఇచ్చామని చెప్పారు. బతుకమ్మకుంటను తిరిగి ఆక్రమించేందుకు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కుట్రలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. బతుకమ్మకుంటను ఆక్రమించిన సుధాకర్‌రెడ్డి వెనుక ఎవరున్నారో ఆలోచించాలని ప్రజలను కోరారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్నామే తప్ప తాము చెరువుల్లో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడం లేదని స్పష్టం చేశారు. వెయ్యి రోజుల పాలనలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో అప్పులేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్ చెప్పిందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల విషయంలోనూ బీఆర్‌ఎస్ నేతలు కమీషన్లు తిన్నారని ఆరోపించారు. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని, మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్ ద్వారా విక్రయించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏడాదిలోపు లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించి ఆడబిడ్డలకు అందించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు నగరానికి అవసరమైన రహదారులు, వంతెనలు, తాగునీరు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ హైదరాబాద్‌ను మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

