కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపు
కాకతీయ, హనుమకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. ఐనవోలు క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కాంగ్రెస్ ఎన్నికల హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన, అబద్ధపు హామీలు, అన్ని వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి మసూద్, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షురాలు ఎల్లవుల లలిత యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బండి రజని, తంపుల మోహన్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, తుళ్ల కుమార్, గోధుమల మధు, మాజీ డివిజన్ అధ్యక్షులు నరేడ్ల శ్రీధర్, నేరెళ్ల రాజు, కేతిరి రాజశేఖర్, జైపాల్, వినోద్, మాజీ కార్పొరేటర్ ఆవల రాధికా రెడ్డి, సిరంగి సునీల్, రాజు నాయక్‌తో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

