ఖైదీలు, చిన్నారులకు న్యాయ సహాయంపై ప్రత్యేక దృష్టి
మామునూరు ఓపెన్ ఎయిర్ జైలు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో తనిఖీ
డీఎల్ఎస్ఏ కార్యదర్శి కందుకూరి పూజ
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఖైదీలు, చిన్నారులకు అందుతున్న న్యాయ సహాయం, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి కందుకూరి పూజ సూచించారు. సోమవారం మామునూరు ఓపెన్ ఎయిర్ జైలుతో పాటు న్యూ లైఫ్ సొసైటీ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆమె సందర్శించారు. ముందుగా జైలులోని న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించి ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయ సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్యారక్‌లు, వసతి ప్రదేశాలను పరిశీలించి ఖైదీలతో మాట్లాడారు. వారి కేసుల స్థితిగతులు, న్యాయపరమైన సమస్యలు, అవసరమైన సహాయం గురించి ఆరా తీశారు. అనంతరం న్యూ లైఫ్ సొసైటీ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నారులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చిన్నారులు నివసించే గదులను సందర్శించి వసతి, పరిశుభ్రత, భద్రత, ప్రాథమిక సౌకర్యాలను తనిఖీ చేశారు. చిన్నారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ కళా సాగర్, జైలర్లు పూర్ణచందర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ పి. శ్రీనివాసరావు, న్యూ లైఫ్ సొసైటీ నిర్వాహకురాలు తదితరులు పాల్గొన్నారు.


