జూటా పాలనకు కేరాఫ్ రేవంత్ సర్కారు
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారు
420 హామీల అమలులో కాంగ్రెస్ దారుణ వైఫల్యం
100 రోజులన్నారు.. 1000 రోజులు అయినా అమలు చేయలేదు
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
తొలి రోజు ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ
కాకతీయ, వర్ధన్నపేట : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే మొహం చాటేస్తోందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల అమలులో దారుణంగా విఫలమైందని విమర్శించారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఒక్కొక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాటలో భాగంగా తొలి రోజు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆకేరు వాగు నుంచి ప్రభుత్వ ఆస్పత్రి, అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించి, ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.


420 హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తోందని అరూరి రమేశ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన 420 హామీలను ప్రజలకు ఇచ్చిన మాటగా భావించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పోరుబాటలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ తదితర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అరూరి రమేశ్ ఆరోపించారు. పేదలు, మహిళలు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలకు గతంలో అందిన సంక్షేమ పథకాలు ఇప్పుడు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ప్రతి గ్రామం, వార్డులో పోరాటం
వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అరూరి రమేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును వివరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ఏడు రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని అరూరి రమేశ్ కోరారు. తొలి రోజు ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీతో పాటు 420 హామీలను ప్రస్తావిస్తూ భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు ఇన్చార్జి మసూద్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

