ఎంపీ ల్యాడ్స్ పనులు త్వరగా పూర్తి చేయాలి
అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దు
ప్రారంభం కావాల్సిన పనులను వేగంగా చేపట్టాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
కాకతీయ, హన్మకొండ: ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పురోగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు ప్రారంభం కావాల్సిన పనులను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో పనుల పురోగతిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహాన్, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, పంచాయతీరాజ్ ఈఈ రాజగోపాల్‌రావు, డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

