అక్రమ బాణసంచా వ్యాపారులపై కొరడా
అనుమతి లేకుండా నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు
దీపావళికి ముందే మట్వాడా పోలీసుల తనిఖీలు
ఇన్స్పెక్టర్ ఎన్. కరుణాకర్ హెచ్చరిక
కాకతీయ, వరంగల్: దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని మట్వాడా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్. కరుణాకర్ హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ మట్వాడా పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమ బాణసంచా వ్యాపారాలపై ముందస్తు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. బాణసంచా విక్రయించాలనుకునే వ్యాపారులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బాణసంచా నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన సరుకును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు, ప్రజలు పోలీసులకు సహకరించి సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని ఇన్స్పెక్టర్ కరుణాకర్ కోరారు.

