స్వామి శాగంటికి ఇండియా స్కూల్ లీడర్షిప్ అవార్డు
మేచరాజుపల్లి ఉపాధ్యాయుడికి జాతీయ స్థాయిలో గౌరవం!
న్యూఢిల్లీలో 15 రాష్ట్రాల విద్యావేత్తల సమక్షంలో పురస్కారం
కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న స్వామి శాగంటికి ప్రతిష్ఠాత్మక ఇండియా స్కూల్ లీడర్షిప్ అవార్డు–2026 లభించింది. అక్టోబర్ 25న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన ఇండియా స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వరల్డ్ అలయన్స్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో 15 రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, ప్రధానోపాధ్యాయులు, విద్యారంగ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన బోధన, వారిలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా స్వామి శాగంటికి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంతో పాటు, ఉన్నత విద్య, భవిష్యత్తు అవకాశాల వైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ గుర్తింపునకు సహకరించిన సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామి శాగంటికి జాతీయ స్థాయి పురస్కారం లభించడంపై మేచరాజుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కుటుంబ సభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

