గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్
27.6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం : గూడూరు సీఐ వినయ్‌కుమార్
కాకతీయ, హన్మకొండ : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 27.6 కిలోల ఎండు గంజాయి, తెల్లరంగు మారుతి కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 5న ఉదయం కోబల్ తండా ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, టీఎస్ 21 టీ 7453 నంబరు గల కారులో అనుమానాస్పదంగా వస్తున్న పురుషుడు, మహిళను ఆపి తనిఖీ చేశారు. కారు డిక్కీలో గంజాయి లభించగా, దాని విలువ రూ.13,82,700గా అంచనా వేశారు. ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి అందజేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో లావుడ్య దేవి అలియాస్ ఝాన్సీ (36), భూక్య నవీన్ (24)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, కొనుగోళ్లు, వినియోగం, నిల్వపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు విశ్వసనీయ సమాచారం ఇచ్చిన వారికి నగదు పారితోషికం అందిస్తామని తెలిపారు.

