బెస్తగూడెంలో గుడుంబా తయారీ గుట్టురట్టు
30 లీటర్ల గుడుంబా స్వాధీనం, 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం
ముగ్గురి పై కేసులు నమోదు
కాకతీయ, ములుగు: గ్రామాల్లో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో గురువారం ఉదయం పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 500 లీటర్ల జాగరీ వాష్‌ను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి పాల్పడిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 15 మోటార్‌సైకిళ్లను అదుపులోకి తీసుకుని సంబంధిత వాహనదారులకు జరిమానాలు విధించారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి వాహనాలను తిరిగి అప్పగించారు.
తనిఖీలు కొనసాగుతాయి
గుడుంబాను అక్రమంగా తయారు చేసినా, విక్రయించినా, సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఎస్సై కొప్పుల తిరుపతి రావు, వెంకటాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నారు.

