ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి
– డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
కాకతీయ,హైదరాబాద్:ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వ్యాపార రంగంలో మరింత ప్రోత్సాహం కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యూసీసీఐ ముఖ్య సలహాదారు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు.
ఈ మేరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీ నిఖిల్ చక్రవర్తిని, యుక్కి చైర్మన్ సోమశేఖర్ గారితో కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించి, ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార అవకాశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న సబ్సిడీలు, బ్యాంకు రుణాల విధానం, బ్యాంకులను ఎలా సంప్రదించాలి, పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఈ అంశాలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి సానుకూలంగా స్పందించడం పట్ల డాక్టర్ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీల్లో కొన్నింటిని ఇప్పటికే విడుదల చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా, స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు.

