ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!
రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర
కులమత, రాజకీయ, వర్గ విభేదాలకు అతీతంగా పాల్గొనాలి
ములుగురోడ్డు చౌరస్తా నుంచి ఉదయం 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభం
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గుడిమల్ల రవికుమార్ పిలుపు
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాడిన ఉద్యమకారులు.. ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం మరోసారి ఐక్యంగా కదలాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గుడిమల్ల రవికుమార్ పిలుపునిచ్చారు. ఉద్యమకారుల హక్కులను సాధించుకునేందుకు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం హనుమకొండలో నిర్వహించనున్న రెండో దశ ఉద్యమకారుల ఉదార యాత్రకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10.30 గంటలకు ములుగురోడ్డు చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారితోపాటు, మలిదశ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో భాగస్వాములైన ఉద్యమకారులు ఈ యాత్రలో పాల్గొననున్నారని రవికుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత నిబద్ధతతో పోరాడామో.. అదే పట్టుదలతో మన హక్కులను సాధించుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హక్కుల కోసం అడగకపోతే ఎవరూ పట్టించుకోరని, మన గొంతుకకు పదును పెట్టకపోతే సమస్యలు పరిష్కారానికి నోచుకోవని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని కోరారు. కులమతాలకు, రాజకీయ పార్టీలకు, వర్గ విభేదాలకు అతీతంగా ఉద్యమకారులంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడివారు అక్కడి నుంచి స్వచ్ఛందంగా బయలుదేరి యాత్రకు చేరుకోవాలని సూచించారు. ప్రయాణానికి అవసరమైన వాహనాలను ఎవరికి వారే సమకూర్చుకోవాలని కోరారు. మూడు నుంచి నాలుగు గంటలపాటు జరిగే ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ములుగురోడ్డు నుంచి మడికొండ వరకు..
హనుమకొండలోని ములుగురోడ్డు చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే యాత్ర హనుమకొండ చౌరస్తా, పోలీసు కమిషనర్ కార్యాలయం, అంబేడ్కర్ సెంటర్, కాళోజీ విగ్రహం, అదాలత్ సెంటర్, ఫాతిమానగర్ మీదుగా మడికొండ వరకు కొనసాగుతుందని రవికుమార్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో క్రమశిక్షణతో పాల్గొనాలని కోరారు. తమకు తెలిసిన ఇతర ఉద్యమకారులను కూడా యాత్రకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల ఐక్యతను చాటుతూ హక్కుల సాధన దిశగా ముందడుగు వేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గుడిమల్ల రవికుమార్ పిలుపునిచ్చారు.

