సిపిఎస్ రద్దు చేయాలి.. ఓపిఎస్ పునరుద్ధరించాలి..
పెన్ను డౌన్ సత్యాగ్రహానికి సిద్ధమైన వరంగల్ సిపిఎస్ ఉద్యోగులు..
సామూహిక సెలవు దరఖాస్తు..
కాకతీయ, వరంగల్ బ్యూరో : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో సిపిఎస్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ మేరకు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ ఓ ), చిట్స్ శాఖకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు సోమవారం జిల్లా రిజిస్ట్రార్‌కు సంయుక్తంగా సామూహిక సాధారణ సెలవు (మాస్ క్యాజువల్ లీవ్) దరఖాస్తును సమర్పించారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న శాంతియుత సత్యాగ్రహ దీక్షలో భాగంగా పెన్ను డౌన్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతపై ఆందోళనలు నెలకొంటున్నాయని, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పాత పెన్షన్ విధానం అమలుతోనే ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుందని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రజలకు అందించే అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఉద్యోగులు హామీ ఇచ్చారు. తమ నిరసన కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ ఓ ), చిట్స్ శాఖకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు పాల్గొని ఓ పి ఎస్ పునరుద్ధరణ కోసం తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగుల పెన్షన్ భద్రత, భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వం కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించి సిపిఎస్ రద్దు, ఓ పి ఎస్ పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

