అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్!
రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు
వారిలో 3.5 లక్షల మంది మహిళలే
ములుగు జిల్లాలో 4,262 మందికి మంజూరు
మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తాం : మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు : “అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించి ఆర్థిక భరోసా కల్పిస్తాం. పింఛన్ పొందని అర్హుల దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేస్తాం. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది” అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎం.ఆర్. ఫంక్షన్ హాల్‌లో నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ములుగు, వెంకటాపూర్ మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామని, వారిలో సుమారు 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మరో 13 వేల దరఖాస్తులు అందాయని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం
మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని సీతక్క తెలిపారు. బ్యాంకు రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మహిళల పేరిట మంజూరు చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తూ వస్త్ర, కిరాణా దుకాణాలు, కోళ్లు, మేకల పెంపకం వంటి ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పేదలపై భారం తగ్గించేందుకు సిమెంట్ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కుటుంబ సంపాదన సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా బాధితులకు సైతం తొలిసారిగా చేయూత పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలకు పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం వంటి పథకాలతో పేదలకు అండగా ఉంటున్నామని వివరించారు. మహిళల్లో అక్షరాస్యత పెంపునకు చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది మహిళలు రాత పరీక్షల్లో పాల్గొన్నారని తెలిపారు.
జిల్లాలో 4,262 మందికి పింఛన్లు
ములుగు జిల్లాలో మొత్తం 4,262 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఏటూరునాగారం 485, గోవిందరావుపేట 497, కన్నాయిగూడెం 81, మల్లంపల్లి 219, మంగపేట 667, ములుగు 390, తాడ్వాయి 340, వెంకటాపూర్ 396, వెంకటాపురం 515, వాజేడు 470, ములుగు మున్సిపాలిటీలో 202 మందికి పింఛన్లు మంజూరైనట్లు వివరించారు. సోమవారం 988 మందికి ఉత్తర్వులు అందజేస్తున్నామని, మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఆసియా, డీఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

