పన్నుల వసూళ్ల సొమ్ము పక్కదారి
వసూలైన మొత్తాన్ని 24 గంటల్లో ఖజానాలో జమ చేయాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : కమిషనర్ టి. వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన ఘటనపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న సీరియస్ అయ్యారు. ఇకపై ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల రూపంలో వసూలైన ప్రతి రూపాయిని 24 గంటల్లో ఖజానాలో జమ చేయాలని ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో 92 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం రెవెన్యూ, పారిశుధ్య అధికారులతో సమీక్షించారు. బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు వసూలు చేసిన మొత్తాలను ప్రతిరోజూ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. జవాన్ల వారీగా వసూలైన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను శానిటరీ ఇన్స్పెక్టర్లు సేకరించి, ఖజానాలో జమయ్యాయో లేదో నిర్ధారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వసూలైన పన్నులు, బకాయిలు, జమ చేసిన మొత్తాలపై డివిజన్ల వారీగా పూర్తి వివరాలతో కూడిన సరిచూసిన నివేదికను పది రోజుల్లో సమర్పించాలని సూచించారు. వసూలైన సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం ఇకపై సహించేది లేదని, 24 గంటలు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజావాణిలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 44, ఇంజనీరింగ్‌కు 28, రెవెన్యూకు 8, ఆరోగ్య, పారిశుధ్య విభాగానికి 7, నీటి సరఫరాకు 4, ఉద్యానవన విభాగానికి ఒక ఫిర్యాదు అందింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కమిషనర్ సమ్మయ్య, ఎస్ఈ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, కార్యదర్శి అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ, ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.

