ఫీజు బకాయిలపై విద్యార్థుల సమరభేరి!
నవంబర్ 25 నుంచి కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు
ఒరిజినల్ సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించాలి: పేరం గోపికృష్ణ
కాకతీయ, హనుమకొండ : ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలలు నిలిపివేసిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించాలని ప్రభుత్వాన్ని పేరం గోపికృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కళాశాలల యాజమాన్యాల ఏకపక్ష వైఖరికి నిరసనగా నవంబర్ 25 నుంచి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దీక్షకు అనుమతి, పోలీసు బందోబస్తు కోరుతూ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు, ముందస్తు సమాచారంతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు గురువారం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫీజు బకాయిల విడుదలలో జాప్యంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిలను సాకుగా చూపుతూ కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, బదిలీ ధ్రువపత్రాలను నిలిపివేస్తున్నాయని విమర్శించారు. యూజీసీ నిబంధనలు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా సర్టిఫికెట్లు, బదిలీ ధ్రువపత్రాలు విడుదల చేసేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు. నవంబర్ 25 నుంచి ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ (ఐడీఓసీ) ఎదుట దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు విడతలవారీగా పాల్గొని మద్దతు తెలపాలని పేరం గోపికృష్ణ విజ్ఞప్తి చేశారు.

