ఒంటరిగానే పోటీ..!
ఎవరితోనూ పొత్తులుండవ్
రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం..
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
హామీల అమలులో అధికార పార్టీ పూర్తిగా విఫలం
డీలిమిటేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
కాంగ్రెస్ పార్టీది బూర్జువా భావజాలం
మహిళల రాజకీయ సాధికారతకు మోదీ కృషి
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ఖానాపూర్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పదవీ బాధ్యతలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టంచేశారు. ఖానాపూర్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పదవీ బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీస్థాయిలో కాదని వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికారబలం ఖానాపూర్‌లో పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, పోలీసుల ఒత్తిడి, గూండాయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించిందని.. కానీ ఖానాపూర్ ప్రజలు, కౌన్సిలర్ సభ్యులు ఆ ప్రయత్నాలకు చెంపపెట్టి లాంటి తీర్పునిచ్చాన్నారు. ఖానాపూర్ ఫలితాలే రాష్ట్రంలోనూ రాజోతున్నాయని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధాకరం
తలసరి ఆదాయం ఉంటేనే అసెంబ్లీ సీట్లు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రాంచందర్ రావు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పేదవారిని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అణచివేయాలనే ఉద్దేశంతో చేసినట్లుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మహిళల హక్కుల గురించి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు వెల్లడించారు. డీలిమిటేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు విచిత్రంగా ఉంది. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. హైదరాబాద్‌లో ఇండస్ట్రీలు, ఎయిర్‌పోర్ట్ వంటి వనరులు ఉండటంతో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఖానాపూర్ లాంటి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. మరి అలాంటి ప్రాంతాలను విస్మరించాలా? అక్కడి ప్రజల ప్రాతినిధ్యం తగ్గించాలా? ఇది కాంగ్రెస్ పార్టీ బూర్జువా మెంటాలిటీని చూపిస్తోంది. ధనిక ప్రాంతాలకు ప్రాధాన్యం… పేద, వెనుకబడిన ప్రాంతాలను పక్కన పెట్టే ఆలోచన కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
విభజన రాజకీయాలకు చోటులేదు
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని మొత్తం ఒకటిగా చూస్తుంది. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతోంది. బీజేపీ ప్రతి భారతీయుడిని సమానంగా చూస్తుంది. విభజన రాజకీయాలకు చోటివ్వదు. ఈ దేశంలో మహిళలు ఎన్నో సంవత్సరాలుగా అన్యాయం ఎదుర్కొన్నారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదు. 1990ల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగులోనే ఉంది. యూపీఏ ప్రభుత్వ కాలంలో కూడా దాన్ని అమలు చేయలేదు. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో.. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకురాలేకపోయారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి మహిళలకు న్యాయం చేసింది. ఇప్పుడు నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో వేలాది మంది మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అవతరించబోతున్నారు. మహిళల రాజకీయ సాధికారతకు ఇది గొప్ప అవకాశంగా మారుతుంది.
కౌలు రైతు ఆత్మహత్య
ఈ నేపథ్యంలో మహిళలందరూ నారీ శక్తిగా ముందుకు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటిసారి మహిళా మంత్రులు లేకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మహిళా సాధికారత కోసం, మహిళా హక్కుల కోసం నిజంగా పోరాడుతున్నది బీజేపీ మాత్రమే. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళల భాగస్వామ్యం కీలకం. అందుకే ఈ చారిత్రక బిల్లు తీసుకువస్తున్నందుకు తెలంగాణ మహిళలందరికీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు. ఖానాపూర్‌లో మహిళా చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక బాధ్యతలు స్వీకరించడం సంతోషకరం. ఇది మహిళా నాయకత్వానికి మంచి ప్రారంభం. రైతు సమస్యల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుబంధు అమలు లేదు.. సరిగ్గా రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కూడా భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య సంఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి మరో ఉదాహరణ.. అని రాంచందర్‌రావు మండిపడ్డారు.
నిరుద్యోగులను మోసం..
అటు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నరేంద్ర మోదీ నాయకత్వంలో వేగంగా జరిగాయి.
అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఖానాపూర్ మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తిగా అందేలా కృషి చేస్తాం. ఖానాపూర్ ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఖానాపూర్ ప్రజలపై ఉంటుంది. అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా, కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఖానాపూర్‌ను మంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.. అని రాంచందర్‌రావు అన్నారు.

