నోరు మెదపరేం..?! కాలు కదపరేం
డీఈవో సార్.. రాధిక స్కూల్‌పై ఎందుకంత ప్రేమ?
అక్రమాలు కళ్లకు కట్టినా చర్యలుండవా..?!
పిల్లల భవిష్యత్‌తో ఆడుకున్న పాఠశాలను వదిలేస్తారా..?!
అక్రమాలకు అడుగులకు మడుగులొత్తుతూనే ఉంటారా..?!
కాకతీయ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదా..!
నీతులు..నిబంధనలు కాగితాలకే పరిమితమా.. కొంతమందికేనా..?
కలెక్టర్ అంకిత్ సార్ మీరైనా దృష్టి పెట్టండి
రాధిక–శ్రీవిద్య స్కూల్స్ దందాలో నిందితులపై జాలెందుకు..?
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్నా ఫర్వాలేదా..!!
కాకతీయ, మణుగూరు : మణుగూరులో రాధిక–శ్రీవిద్య స్కూల్స్ అక్రమాలను కాకతీయ స్పష్టమైన ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చినా.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీన్ని కూడా మాములుగానే వదిలేస్తున్నారా..? అన్న అనుమానాలు కలిగిస్తోంది. పాఠశాలపై స్పష్టమైన ఆరోపణలతో పత్రికల్లో కథనాలు రాసినప్పుడు బాధ్యత కలిగిన డీఈవో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి…నిజానిజాలేంటో బహిర్గతం చేసి..చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. మౌనముద్ర దాయడం వెనుక అక్రమార్కులను కాపాడే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. “నోరు మెదపరేం..? కాలు కదపరేం..?” అనే ప్రశ్న ఇప్పుడు ఒక్క కాకతీయది కాదు… ప్రతి తల్లిదండ్రి గొంతు నుంచి వినిపిస్తున్న ఆక్రోశంతో కూడిన ఆవేదన స్వరం.

ఈ నేరాన్ని చిన్నగా చూపుతున్నారా సార్..!
ఒకే భవనంలో రెండు స్కూల్స్ నడుస్తున్నాయంటే అది చిన్న విషయం కాదు. అది నేరం. అది విద్యార్థుల భవిష్యత్తుతో ఆట. ప్రభుత్వాన్ని సైతం మోసం చేసినట్లు కాదా..?! మరి ఈ అంత పెద్ద అక్రమం కళ్ల ముందే జరుగుతుంటే… డీఈవో కార్యాలయం ఎందుకు మౌనం పాటిస్తోంది..? ఈ మౌనం వెనుక ఎవరిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది..? కాపాడటంలో ఉద్దేశం ఏంటీ.? ఇదే అసలు ప్రశ్న. గత నాలుగేళ్లుగా అనుమతులు లేకుండానే రాధిక స్కూల్ నడించింది. ఆరు నెలల క్రితం పర్మిషన్లు పొంది.. ఏం లేదు.. అంతా సవ్యంగా ఉందని ఉల్టా బుకాయించి.. కాకతీయపైనే అబండాలు.. అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేసింది. మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా..డొంక తిరుగుడు వ్యవహారంతో ముందుకెళ్తోంది. పాఠశాలకు గుర్తింపు లేదు… కానీ సర్టిఫికెట్లు ఉంటాయి. ఇది ఎలా సాధ్యం..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఎవరు..? డీఈవో సార్… మీరు కాదా..? జిల్లా విద్యాశాఖ అధికారిగా మీకు సమాధానం చెప్పే బాధ్యత లేదా..? వ విచారణ జరిపేందుకు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

రాధికలోనే శ్రీవిద్య… ఇదే నిజం..!
బయటకు రెండు స్కూల్స్… లోపల ఒకటే వ్యవస్థ. మణుగూరులోని రాధిక స్కూల్ భవనంలోనే శ్రీవిద్యకు చెందిన 68 మంది విద్యార్థులు చదువుతున్నారని బయటపడింది. మరి శ్రీవిద్య ఎక్కడుంది..? భవనం ఎక్కడుంది..? బోర్డు ఎక్కడుంది..? కేవలం కాగితాలపై ఉన్న స్కూల్ ఎలా నడుస్తోంది..? ప్రభుత్వ నమోదుల్లో విద్యార్థుల వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ స్కూల్ కనిపించడంలేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే… ఈ విషయాన్ని స్థానిక అధికారులే అంగీకరించారు.
విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికెట్లపై శ్రీవిద్య ముద్ర… కానీ సంతకాలు రాధిక ప్రతినిధులవి. ఇది నిబంధనల ఉల్లంఘన కాదా..? లేక అధికారులకు తెలిసీ తెలియనట్టు నటిస్తున్నారా..? అంగీకరించిన వారు చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారు..? చట్టాలు,రూల్స్ కొంతమందికేనా..? విద్యాశాఖ అధికారులు నీతులు, నిబంధనల వర్తింపు కొందరికేనా..? రాధిక పాఠశాలకు చెందిన ముగ్గురు, శ్రీవిద్యకు చెందిన మరో ఇద్దరు భాగస్వాములు కలిసి ఈ దందా నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల మౌనం… అనుమానాలకు తావు..!
ఇంత జరుగుతున్నా… డీఈవో కార్యాలయం నుంచి ఒక్క స్పష్టమైన స్పందన లేదు. ఎందుకు..? ఎవరి కోసం ఈ మౌనం..? అక్రమాలు కనిపించడంలేదా..? లేక కనిపించినా చూడనట్టు నటిస్తున్నారా..? నీతులు… నిబంధనలు కేవలం కాగితాలకేనా..? లేక సాధారణ ప్రజలకేనా..? ప్రభావశీలులైతే మినహాయింపులుంటాయా..? ఇదే ప్రజల అనుమానం. ఈ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి..? రేపు వారి సర్టిఫికెట్లు చెల్లుతాయా..? వారి చదువు గుర్తింపు పొందుతుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు..? తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్‌లను నమ్ముతారు. కానీ ఆ నమ్మకాన్ని డబ్బుగా మార్చేస్తే… అది క్షమించలేని తప్పు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది కాకతీయ అక్షర పోరాటం. ఒక్కో అంశాన్ని బయటపెడుతూ… నిజాలను ప్రజల ముందుంచుతోంది. “ఎందుకు చర్యలు లేవు..? ఎవరు బాధ్యులు..?” అనే ప్రశ్నలను పదేపదే లేవనెత్తుతోంది. ఈ ప్రశ్నలు కేవలం వార్త కోసం కావు… బాధ్యత కోసం. సమాధానం కోసం. న్యాయం కోసం.
కలెక్టర్ సార్… మీ జోక్యం అవసరం
ఇప్పుడు అందరి చూపు జిల్లా కలెక్టర్ అంకిత్‌పైనే ఉంది. ఈ వ్యవహారంపై తక్షణ విచారణ అవసరం. నిందితులపై కఠిన చర్యలు అవసరం. ముఖ్యంగా… విద్యార్థుల భవిష్యత్తును కాపాడే నిర్ణయాలు అవసరం. ఇప్పటికైనా అధికారులు మౌనం వీడి చర్యలు తీసుకుంటారా..? లేక “నోరు మెదపరేం… కాలు కదపరేం” అన్న విమర్శలకే పరిమితమవుతారా..? కాకతీయ వేచి చూస్తుంది.! ప్రశ్నించడం మాత్రం ఆగం.

