ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు
జీవో 38 విడుదల
ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు
ఒకేచోట 3 ఏళ్లు పనిచేసిన వారికి ట్రాన్స్ఫర్లు
మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనుమతి
వితంతువులు, స్పౌజ్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత
జనగణన విధుల్లో ఉన్న వారికి వర్తించని మార్గదర్శకాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బదిలీల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగుల బదిలీలపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అర్హులైన ఉద్యోగుల ట్రాన్స్ఫర్లకు అనుమతులు కల్పించింది. 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఒకే చోట నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, వితంతువులు, స్పౌజ్, కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జనగణన విధుల్లో ఉన్న వారికి బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది.
షెడ్యూల్ రిలీజ్
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది. సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ బదిలీల మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ జీవో 38 విడుదల చేసింది. మే 1 నుంచి 31 వరకు బదిలీలకు షెడ్యూలు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఒకే చోట మూడేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది డిసెంబరు 31 నాటికి ఒకే చోట నాలుగేళ్లు పని చేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మే 31లోగా ఉద్యోగ విరమణ చేసే వారికి స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు. ఒకే కేడర్ లో 40 శాతానికి మించి ఉద్యోగును బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. స్పౌజ్, వితంతువు, వచ్చే ఏడాది మే 31లోగా రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి వైకల్యం ఉన్న వారు మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హర్ట్ సర్జరీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
అప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న వాళ్లకు ప్రాధాన్యత
ప్రస్తుతం అప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ప్రాధాన్యత స్థానాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. కఠినమైన ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వారికి కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. స్పౌజ్ కేటగిరీలో మూడేళ్ల ఏళ్ల నిబంధన వర్తించదు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. విద్యాశాఖ, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణ, అటవీ శాఖలు విడిగా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తాయి. 5 ప్రాంతాలను ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు : మే 1 నుంచి 7 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. మే 8 నుంచి 15 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరిస్తారు. ఉద్యోగి గరిష్టంగా 5 ప్రాంతాలను ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు. మే 16 నుంచి 24 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలించి 25 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ఉత్తర్వుల జారీ చేస్తారు. బదిలీ ఉత్త్వులు ఇచ్చిన మూడు రోజుల్లో ఉద్యోగి రిలీవ్ అయినట్లుగా పరిగణిస్తారు. జూన్ 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జనగణన విధుల్లో ఉన్న బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :
లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడతారు. అవసరమైతే హార్డ్‌షిప్ పోస్టులకు లాటరీ విధానం అమలు చేస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి బదిలీల ప్రక్రియ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

