పల్లెల్లో పత్తాలాట జోరు
పక్కా నెట్‌వర్క్‌తో పేకాట దందా!
ఏటూరునాగారం మండలంలో సీక్రెట్‌గా పేకాట కేంద్రాలు
దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న జూదరులు
పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రత్యేకంగా ‘ఎస్కార్ట్’ టీంలు
యువతను బలి తీసుకుంటున్న వ్యసనం
రోడ్డున పడుతున్న కుటుంబాలు
నెలవారీ మామూళ్లతోనే అధికారులు మౌనం?

కాకతీయ, నిఘా ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొన్ని గ్రామాల్లో పేకాట డెన్లు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో పత్తాలాట జోరుగా సాగుతుండటంతో సామాన్య కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట, రామ్ నగర్, శంకర్ రాజ్‌పల్లి, రోయ్యూర్ గ్రామాల్లో పేకాట రాయుళ్లు అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ జూద క్రీడ సాగుతున్నప్పటికీ, అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ భవనంలో బహిరంగంగానే పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఓడవాడలోని కరకట్ట సమీపంలో ఉన్న గుడిసెలు, రామ్‌నగర్ గోదావరి కరకట్ట, ముళ్లకట్ట – రాంపూర్ సరిహద్దులు పేకాట అడ్డాలుగా మారాయి. ఇక్కడ ప్రతి గేమ్‌పై వేల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు ప్రతి గేమ్‌కు కమిషన్ వసూలు చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచే కాకుండా పక్క మండలాల నుంచి కూడా జూదరులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.

ఎస్కార్ట్ టీంలతో పక్కా నిఘా
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిర్వాహకులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. జూద కేంద్రాలకు కిలోమీటర్ దూరంలోనే ‘ఇన్ఫార్మర్ల’ను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఎస్కార్ట్ టీంలకు రోజువారీగా రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు కూలీ చెల్లిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా పోలీసులు అటువైపు వస్తే వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక జూదరులకు మద్యం, సిగరెట్లు, గుట్కాలు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసి విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
బలవుతున్న యువత.. కునారిల్లుతున్న కుటుంబాలు
ఈ జూద వ్యసనానికి ఎక్కువగా యువకులే బానిసలవుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పేకాటలో పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. ఇటీవల మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న యువకుడి కోసం అతని కుటుంబ సభ్యులు వచ్చి నిర్వాహకులతో ఘర్షణ పడినట్లు సమాచారం. అయినా నిర్వాహకులు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చి, మరుసటి రోజు నుండే మళ్లీ యథావిధిగా దందాను కొనసాగిస్తున్నారు. పరువు పోతుందనే భయంతో చాలా కుటుంబాలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాయి. పేకాట నిర్వాహకుల నుంచి అధికారులకు భారీగా మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఏటూరునాగారం మండలంలో పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

