ఆర్టీసీ సమ్మె న్యాయమైనది
కార్మికుల సంక్షేమం కోసమే పోరాటం
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు
కాకతీయ, కొత్తగూడెం : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె అత్యంత న్యాయమైనదని, ఇందులో కార్మికుల స్వార్థం ఏమీ లేదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ పేర్కొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ నాయకులు కొత్తగూడెం డిపో కార్మికులను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి, కార్మికుల సంక్షేమం కోసమే ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థలోనే కొత్త బస్సులను ప్రవేశపెట్టి నడిపించాలని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మిక యూనియన్లతో చర్చలు జరిపి, వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలని డిజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి
ప్రభుత్వం మొండివైఖరి వీడి యూనియన్లతో చర్చలు జరపాలని, తద్వారా సమ్మెను విరమింపజేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని నాయకులు కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సాగే పోరాటానికి తమ సంఘాల తరపున సంపూర్ణ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఐఎఫ్టీయూ నాయకులు మోత్కూరి మల్లికార్జునరావు, జీ సంజీవరావు, లిక్కి నరేష్, జీవన్, సాగర్, కనకాచారి, రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

