ప్రశ్నించే గొంతుకలను కేంద్రం అణచివేస్తోంది
కమ్యూనిస్టులను జైళ్లలో పెట్టడం సాధ్యం కాదు
ప్రజాస్వామికవాదులపై ఎన్ఐఏ కేసులు ఉపసంహరించుకోవాలి
ఐయూఎంఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా
కాకతీయ, ఖమ్మం: దేశంలో ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఆరోపించారు. ప్రజాస్వామికవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా కేసులు నమోదు చేయించి విచారణల పేరుతో వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును ఎన్ఐఏ విచారణకు పిలవడం అప్రజాస్వామికమని బాజీ బాబా పేర్కొన్నారు. ప్రభుత్వాల చట్టవ్యతిరేక విధానాలను ఎండగట్టడం, భూమి కోసం, భుక్తి కోసం పేదల పక్షాన నిలబడి పోరాడటం వామపక్ష పార్టీల నైజమని తెలిపారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే వారిపై నక్సలైట్లుగా ముద్ర వేయడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
పార్లమెంటులో నిలదీస్తాం
ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉందని, కమ్యూనిస్టులను జైళ్లలో పెట్టాలని చూస్తే దేశంలోని జైళ్లు సరిపోవని బాజీ బాబా హెచ్చరించారు. పోటు రంగారావుపై నమోదు చేసిన ఎన్ఐఏ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే, తమ పార్టీ ఎంపీల ద్వారా ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించేలా చూస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఐయూఎంఎల్ ఎల్లప్పుడూ ప్రజాస్వామికవాదులకు అండగా ఉంటుందని వెల్లడించారు.

