చింతకానిలో వేడుకగా సామూహిక సీమంతాలు
ముగిసిన ‘పోషణ్ పక్వాడ్’ వారోత్సవాలు
గర్భిణీలకు పౌష్టికాహారంపై అవగాహన
కాకతీయ, చింతకాని: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో 8వ ‘పోషణ్ పక్వాడ్’ ముగింపు ఉత్సవాలు గురువారం అత్యంత వేడుకగా జరిగాయి. సర్పంచ్ కిలారు మనోహర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పండ్లు, మిఠాయిలు అందజేసి సాంప్రదాయబద్ధంగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మనోహర్ బాబు మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా 15 రోజుల పాటు ఈ ప్రత్యేక వారోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగిన ఈ 8వ ఎడిషన్‌లో భాగంగా చిరుధాన్యాల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రతపై అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
తల్లీబిడ్డల క్షేమం కోసమే..
అనంతరం అధికారులు మాట్లాడుతూ.. గర్భిణీలకు ఆరోగ్యకరమైన ప్రసవం జరగాలని, పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చేసే సాంప్రదాయ వైదిక వేడుక సీమంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాని ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఆయుష్ డాక్టర్ శ్రీదేవి, సీడీపీఓ కమల ప్రియ, సూపర్వైజర్ విజయలక్ష్మి, సీహెచ్‌ఓ వీరేందర్ పాల్గొన్నారు. వీరితో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

