ఏం పాపం చేశావామ్మా…!!
శ్మశాన వాటికలో ఆరు నెలల పసి పిండం వదిలివేత
స్థానికులను కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన
కాకతీయ, మణుగూరు టౌన్: కన్నప్రేమ కఠినమైంది.. పేగుబంధం తెగిపడింది. కన్నవారే తమ రక్తాన్ని పంచుకు పుట్టిన పసికందుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలు నిత్యం కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా అభం శుభం తెలియని ఆరు నెలల పసి పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన మణుగూరు మండలంలో వెలుగుచూసింది. గుట్ట మల్లారం పంచాయతీలోని వైకుంఠధామం స్మశాన వాటికలో శనివారం ఉదయం ఈ దారుణం వెలుగు చూసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు నెలల పసి పిండాన్ని (ఆడ శిశువు) అక్కడి బాత్రూంలో వదిలి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ తల్లి కన్న బిడ్డో కానీ, క్షణికావేశంలో చేసిన తప్పో లేక మోసపోయి తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ, ఆ పసి ప్రాణాన్ని అలా వదిలేయడం స్థానికులను కంటతడి పెట్టించింది.
అనాథలుగా వదిలేయకండి
విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారులు మాట్లాడుతూ.. ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని, అంతేకానీ ఇలా రోడ్లపై, స్మశానాల్లో అనాథలుగా వదిలి వెళ్లడం సరైంది కాదన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, పిల్లలు లేని వారికి చట్టబద్ధంగా అందజేస్తామని సూచించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

