అధికారుల కళ్ళుగప్పి.. మైనర్‌కు పెళ్లి!
గద్వాలలో వింత ఘటన
ఒకరికి బదులు మరొకరిని తీసుకెళ్లిన అధికారులు
అధికారులు వెళ్లగానే గుడిలో వివాహం
విధుల్లో నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బాల్య వివాహాన్ని అడ్డుకోవాల్సిన అధికారుల అత్యుత్సాహం, నిర్లక్ష్యం ఒక మైనర్ బాలిక జీవితాన్ని అంధకారంలోకి నెట్టాయి. పెళ్లి కూతురుని తీసుకెళ్లాల్సిన అధికారులు.. ఆమె చెల్లిని తీసుకెళ్లడంతో, అసలు పెళ్లి కూతురుకి కుటుంబ సభ్యులు నిమిషాల వ్యవధిలోనే పెళ్లి జరిపించారు. గద్వాల మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని ఓ కుటుంబంలో మైనర్ బాలికకు వివాహం నిశ్చయమైంది. సమాచారం అందుకున్న ఐసీడీఎస్, పోలీస్ అధికారులు పెళ్లిని అడ్డుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అధికారుల రాకను గమనించిన కుటుంబ సభ్యులు చాకచక్యంగా వ్యవహరించారు. మైనర్ అయిన పెళ్లి కూతురును అక్కడి నుండి తప్పించి, ఆమె స్థానంలో చెల్లిని నిలబెట్టారు.
గుర్తింపులో ఘోర తప్పిదం..
కనీసం పెళ్లి పత్రికలో ఉన్న పేరును గానీ, ఆధార్ కార్డులోని ఫోటోను గానీ సరిచూసుకోని అధికారులు.. పెళ్లి కూతురు చెల్లెలిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అధికారులు వెళ్లిన వెంటనే, తప్పించిన పెళ్లి కూతురును దగ్గరలోని ఓ గుడికి తీసుకెళ్లిన పెద్దలు.. ఆగమేఘాల మీద వివాహం జరిపించేశారు. అధికారుల నిర్వాకం వల్ల ఒక బాలిక జీవితం చట్టం కళ్ల ముందే బలైపోయింది. తాము తీసుకువచ్చింది పెళ్లి కూతురును కాదని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అధికారుల విధుల్లో ఇంతటి బాధ్యతారాహిత్యంపై స్థానికులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐసీడీఎస్ మరియు పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పొరపాటే ఆ మైనర్ బాలిక పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

